ఎందరో మహానుభావులు - అందరికీ పాదాభివందనాలు - Tributes to my Teachers - Noojilla Srinivas

 

*ఎందరో మహానుభావులు - అందరికీ పాదాభివందనాలు*
---------


ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నా ఎదుగుదలకు కారణమైన ఉపాధ్యాయులకు, నిరంతరం ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్అంరేరణను రగిలించిన ఉపాధ్యాయులకు, గురువులకు పాదాభివందనాలు అర్పిస్తున్నాను.

సుదీర్ఘంగా అనిపించినా... నా ఈ కృతజ్ఞతాంజలి ఎందరి వల్ల నేడు నేను కనీసం ఈ స్థితిలో ఉన్నానో గుర్తు చేసుకొనేందుకు నాకు నేను కల్అపించుకొంటున్న అవకాశంగా, అవసరంగా భావిస్తున్నాను.

అందరికి మల్లే నాకు కూడా మా తల్లిదండ్రులే తొలి గురువులు... అందులోనూ లోకమందరి చేత ఆదర్శవంతమైన తెలుగు మాస్టారిగా, ఉభయ భాషా సాహిత్య వేత్తగా, పురాణ ప్రవచన కర్తగా, వేద పండితులుగా, ఆధునిక వాగ్గేయ కారునిగా పేరు గాంచిన మా నాన్నగారు శ్రీ నూజిళ్ళ లక్ష్మి నరసింహం గారి ప్రభావం మా అందరి మీద అధికం. కాని వారి దగ్గర ప్రత్యక్షంగా చదవలేకపోయిన లోటు అలానే ఉండిపోయింది.

విద్యార్థి జీవితం ప్రారంభం ఎక్కడ? అంటే ఏ పాఠశాలలో ప్రారంభం అయింది? అంటే ఇప్పటికి నాకు సంశయమే... ఎందుకంటే అప్పటికే బ్లూ కాన్వెంట్ గా పిలవబడే రవీంద్ర విద్యా నికేతన్ లో జ్ఞాపకాలు కొన్ని ఉన్నాయి... దాన్ని స్థాపించిన శ్రీమతి కె. వరలక్ష్మి గారు Vara Lakshmi Kala మా నాన్నగారికి ప్రియమైన శిష్యురాలు. బహుశా ఆ అభిమానంతో మొదట అక్కడ జాయిన్ చేసారేమో... కానీ ఎక్కువ రోజులు చదివిన జ్ఞాపకం లేదు... కానీ ఉన్న జ్ఞాపకాలు మాత్రం పదిలం. నేడు కొత్త వెంకన్న గారి ఇల్లు గా పిలవబడే, కొంగల రావి చెట్టు సమీపంలో ఉన్న ఆ కాన్వెంట్ లోనే బహుశా నా బాల్యమిత్రులు బండారు రాజా వంటి వారితో పరిచయం ఏర్పడి ఉంటుంది. శ్రీమతి కె. వరలక్ష్మి గారు ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రముఖ కథా రచయిత్రిగా పేరు తెచ్చుకొని, మా జగ్గంపేట గ్రామానికి కూడా పేరు తెచ్చారు. వారి రెండో అమ్మాయి లలిత నాకు క్లాస్మేట్. వారి పెద్ద అమ్మాయి డాక్టర్ కె. గీత ప్రముఖ రచయిత్రి, కవయిత్రి. వారి అబ్బాయి రవీంద్ర ఫణిరాజ్ అన్నయ్య కు క్లాస్మేట్.

ఇక ప్రాథమిక పాఠశాల మండల ప్రజాపరిషత్ పాఠశాల వెంట్రాప్రగడ తాతాజీ గారి దివాణం లో ఉండగా మా తరగతులు కొన్ని రోజులు జరిగినట్టు గుర్తు. ప్రధానమైన జ్ఞాపకం అయితే జగ్గంపేట రాజుల వీధిలో అప్పటికి నూతనంగా నిర్మించబడిన పాఠశాలలో .. (నేడు దురదృష్టవశాత్తూ సచివాలయం గా మార్చబడి పాఠాలకి దూరమైంది)

ఒకటి, రెండు తరగతులు కలిపి ఒకే రూమ్ లో ఉన్నట్టు గుర్తు... అప్పటి టీచర్లు కరుణమ్మ గారు, మరొకరు గూటాల మాస్టారి భార్య గా పిలవబడే మేడం గారు.. ముఖ్యంగా నన్ను బాగా ఇష్టపడుతూ మాకు బాగా పాఠాలు చెప్పిన కరుణమ్మ గారు ఆదర్శ ఉపాధ్యాయినిగా మనసులో ముద్ర వేశారు. ఇక మూడవ తరగతి లో సూర్యారావు మాస్టారు లెక్కలు, తెలుగు చేతిరాత తప్పులపై బాగా దృష్టి పెట్టే వారు. దండించినా నేడు దండం పెట్టవలసిన సేవ వారిది. నాలుగవ తరగతి రూతమ్మ గారు అవ్యాజమైన ప్రేమాభిమానాలు కురిపించే వారు. పిల్లలందరినీ ఇష్టపడి పాఠాలు చెప్పేవారు. ఎప్పుడూ కోపగించని మనస్తత్వం వారిది.

ఇక ఎప్పటికీ మా కుటుంబం మొత్తానికి గుర్తు ఉండిపోయే అప్పటి మా హెడ్మాస్టర్ గారు, మాకు ఐదవ తరగతి మాస్టారు అయిన శ్రీ మారిశెట్టి భద్రరావు మాస్టారు. వీరు మా అన్నదమ్ములు, అక్కకు కూడా టీచర్ కావడం విశేషం.. వీరికి మా నాన్నగారి పేరున విద్యారంగంలో పురస్కారం ఇవ్వడం మా కుటుంబానికి ఆనందం ఇచ్చే అంశం. శ్రీ భద్రరావు మాస్టారు ఇప్పటికీ తన సేవలను పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు అనేక సేవలు అందిస్తున్నారు. తరచూ ఫోన్ చేసి తన ఆశీస్సులను అందిస్తూ ఉండే సౌజన్య మూర్తి.

ఇక ఉన్నత పాఠశాలలో ఆరవతరగతి నుండి పాఠాలు చెప్పిన శ్రీ అరవింద్ మాస్టారు, డ్రాయింగ్ మాస్టారు శ్రీ ఎన్. సుబ్బారావు గారు, క్రాఫ్ట్ మాష్టారు, శ్రీమతి అనురాధ గారు, శ్రీ ఆచార్యులు గారు, శ్రీ ఉదయ భాషా రెడ్డి గారూ, శ్రీ కొంపెల్ల కామేశ్వరరావు గారు, శ్రీ రామ్మోహన రావు గారు, శ్రీ ప్రభుదాస్ గారు, శ్రీమతి విమలాదేవి గారు, శ్రీమతి కుసుమ కుమారి గారు, శ్రీ పురాణపండ సత్యనారాయణ మూర్తి గారు, డ్రిల్లు మాస్టారు ... ఇలా అందరూ ఎవరి స్థాయిలో వారు సహకారాన్ని, స్ఫూర్తిని అందించిన వారే.

ప్రైవేట్ మాస్టారిగా జగ్గంపేట లో ప్రముఖులైన గోపాల కృష్ణ మాస్టారికి ప్రత్యెక ధన్యవాదాలు ఆరు, ఏడూ తరగతులలో వారు వేసిన పునాదికి, నేర్పిన క్రమశిక్షణకు.


అరవింద్ మాస్టారు హిందీ సినిమా యాక్టర్ లా ఉండే వారు. తెలుగు మాష్టారు అయినా మాకు ఆరో తరగతి లో ఇంగ్లీష్ గ్రామర్ చక్కగా చెప్పిన వారు. (ఇంటర్ లో మొదటి సంవత్సరం నేను మేథ్స్ ఫెయిల్ అయినప్పుడు... రోడ్డు మీద వెళుతున్న నన్ను పిలిచి, "నూజిళ్ళ మాష్టారు అబ్బాయివి... ఫెయిల్ అయినందుకు సిగ్గు లేదురా... అని చెంప మీద వాయించి ... బుద్ధి గరపిన మాష్టారు). డ్రాయింగ్ మాష్టారు అయినప్పటికీ శ్రీ సుబ్బారావు గారు నీతి కథలు బోధించే వారు, మాచేత కథలు చెప్పించే వారు, పాటలు పాడించే వారు. నేటికీ నన్ను ఆశీర్వదిస్తూ ప్రోత్సహిస్తూ ఉండే మాష్టారు వారు. క్రాఫ్ట్ మాష్టారు మాకు స్కౌట్స్ సర్ కూడా... వారి ఆధ్వర్యంలో జరిగిన స్కౌట్స్ క్యాంపులు వ్యక్తిత్వ వికాసం లో ఎన్నో పాఠాలు నేర్పాయి. సెవెంత్ క్లాస్ లో సైన్స్..ముఖ్యంగా కెమిస్ట్రీ ఈక్వేషన్స్ ని పరిచయం చేసిన అనురాధ మేడం, తర్వాత సోషల్ మరియు ఇంగ్లీష్ చక్కగా బోధించిన ఆచార్యులు మాష్టారు. ముఖ్యంగా ఆచార్యులు మాష్టారు గారే నన్ను B.Ed. చెయ్యమని ప్రోత్సహించి ఆ మార్గాన్ని ఎంచుకోడానికి కారణమయ్యారు.

ఇక హిందీ అక్కయ్య గారుగా మా నాన్నగారి కాలం నుండి కూడా జగ్గంపేట సమాజానికి చిరపరిచితులు అయిన శ్రీమతి విమలాదేవి గారు హాస్యంతో, చతురతతో విద్యార్థుల పట్ల ప్రేమతో ఎలా బోధించాలో ప్రత్యక్ష ఉదాహరణగా నిలచిన వారు. ఆమె స్కూల్లోనూ, బయట కూడా అనేక మంది చే హిందీ పరీక్షలు కట్టించి ఇంటి దగ్గర ఉండే స్త్రీలు కూడా హిందీ టీచర్లుగా అయ్యేటట్లు చేసిన ఘనత వారిదే. (ప్రత్యక్షంగా టీచర్ కాకపోయినా...వారి భర్త శ్రీ శివాజీ గారు లైబ్రేరియన్ గా అందించిన సేవలు ఘనం.. నావంటి వారు ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందటంలో సహాయకారి అయిన వదాన్యులు )

శ్రీమతి కుసుమ కుమారి గారు బయాలజీ బోధించే వారు. మృదు స్వరంతో పాఠాలు బోధించే వారు. ఇక వారికి సోదరులు అయిన శ్రీ ప్రభుదాస్ గారు హాస్య చతురతతో సోషల్ బోధించిన విధానం ఎప్పటికీ గుర్తే .. ఎంతో సరదాగా సందడిగా ఉండేది వారి క్లాస్. వ్యక్తిగతంగా ఎంతో అభిమానాన్ని చూపించే వారు. మేథ్స్ బోధించిన శ్రీ కె. రామ్మోహన రావు గారు ముందుగా ప్రస్తావించిన శ్రీమతి కె. వరలక్ష్మి గారి శ్రీవారు. టక్ చేసుకొని హుందాగా ఉండే వారు. ఫిజికల్ సైన్స్ బోధించిన శ్రీ కొంపెల్ల కామేశ్వర రావు గారు నేటికీ కలుస్తూ ఆశీస్సులు అందిస్తూ ఉంటారు. వారి అమ్మాయి పద్మ నా క్లాస్మేట్ కూడా...

ఇక ఇంటర్మీడియట్ దశలోకి ప్రవేశించే విషయంలో నాజీవితంలో కీలక పాత్ర పోషించిన వారు జగ్గంపేట జూనియర్ కాలేజి కామర్స్ లెక్చరర్ గా పనిచేసి, తదుపరి ప్రిన్సిపాల్ గా రిటైర్ అయిన శ్రీ విజయకుమార్ గారు. Vijaya Kumar Lingala అప్పటికి హైస్కూల్, కాలేజీ కలిపి నడుస్తూ ఉండటం వలన, వారు కామర్స్ లెక్చరర్ అయినా ఆరవ తరగతి నుండి కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ వివిధ పోటీ పరీక్షలలో పాల్గొనేటట్లు చేసేవారు. వ్యక్తిగతంగా వారు నా జీవితంలో చాలా కీలక పాత్ర పోషించారు. నేను Maths అంటే ఉన్న భయంతో ఇంటర్ లో CEC/HEC groups లో జాయిన్ అవుదాం అని అనుకున్నా.. కానీ నాకు MPC application మాత్రమే ఇప్పించారు. అప్పుడు కోపం బాధ అనిపించినా దాని వెనుక కారణాన్ని వారు తర్వాత ఎప్పుడో వివరించారు... పోటీ పరీక్షలలో (ముఖ్యంగా సివిల్స్ లో..) మేథ్స్ పోషించే పాత్ర మూలంగా అది చదవడం మంచిది అని నా భవిష్యత్తు గురించి ఆలోచించి వారు చేసిన ఆ సూచన తర్వాత అనేక ప్రభుత్వ ఉద్యోగాలను పొందటంలో నాకు ఉపకరించింది. ఇక ఉపాధ్యాయునిగా వీరి వదాన్యతకి పరిమితి లేదు. పనిచేసిన ప్రతి చోటా, కళాశాల, విద్యార్థుల అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేసిన వీరు పదవీ విరమణ అనంతరం కూడా ఆలమూరు కళాశాల విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఉచిత యూనిఫారాలను అందిస్తూ వస్తున్నారు. నన్ను ఫోన్ ద్వారా ఫేస్బుక్ ద్వారా నిత్యం ఆశీర్వదించే శ్రేయోభిలాషి. ఆదర్శ ఉపాధ్యాయుడు అనేదానికి నిలువెత్తు రూపం వారు.

ఇంటర్లో ఇంగ్లీష్ బోధించి నేను కూడా ఇంగ్లీష్ లెక్చరర్ అవ్వాలనే ప్రేరణను అందించిన వారు శ్రీ ఏ. జే. ప్రసాద్ గారు... వారు NSS coordinator గా కూడా పనిచేసి రెండేళ్ల పాటు సేవాకార్యక్రమాలు నిర్వహింపజేసి విద్యార్థులను భాగస్వామ్యం చేశారు. వారు నాపైన వ్యక్తిగతంగా చూపిన ప్రేమాభిమానాలకి కొదవ లేదు. ఈమధ్యనే వారు కాలం చేశారు. వారికి ఈ సందర్భంగా ప్రగాఢ నివాళి. తెలుగు బోధించిన శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యం గారు హాస్యంతో, చతురతతో పాఠాలు బోధిస్తూ అలరించడంలో అందె వేసిన చేయి. వారి కుటుంబం మా ఇంటికి పక్కనే నివసించడం మూలంగా అందరూ మాకు బంధువులే. మేథ్స్ చెప్పిన ఎడ్వర్డ్ గారు, ఫిజిక్స్ లెక్చరర్ శ్రీ చలపతి రావు గారు, కెమిస్ట్రీ లెక్చరర్ శ్రీ గోపాల కృష్ణ గారు నాకు భయం అనిపించే మేథ్స్, సైన్సుల పట్ల కొద్దిగా అన్నా ఆసక్తిని కలిగించిన గురువులు.

ఇంటర్ తర్వాత... పెద్దాపురం మహారాణి కళాశాలలో స్పెషల్ ఇంగ్లీష్ తో డిగ్రీ చేద్దామనుకున్నా తప్పని సరి పరిస్థితుల్లో వెయిటింగ్ లిస్టు లో వచ్చిన బి.ఎస్సీ. ఎం.పీ.సీ. జాయిన్ అవక తప్పలేదు. అయితే అది స్ఫూర్తిదాయకమైన గురువులను ఆత్మీయులైన మిత్రులను అందించిన అవకాశం.

ఇంగ్లీష్ బోధించిన శ్రీ వర్మ గారు, శ్రీ కీర్తి భాస్కరరావు గారు, శ్రీమతి శాంతి గారూ ఎప్పటికీ గుర్తుండే గురువులు. తెలుగును ప్రత్యక్షంగా బోధించిన శ్రీ పంపన సూర్యనారాయణ గారు వారి పద్య పఠనం ద్వారా, ఆహార్యం ద్వారా గుర్తుండి పోతే, ప్రత్యక్షంగా బోధించక పోయినా వారి వ్యక్తిత్వం ద్వారా సౌహార్డ్ర హృదయం ద్వారా ఆత్మీయులుగా నేటికీ ఆశీస్సులు అందించి ప్రోత్సహించే వారు శ్రీ జోస్యుల కృష్ణబాబు మాష్టారు.

ఇక మేథ్స్ చెప్పిన శ్రీ ద్వివేదుల పద్మనాభం గారి ప్రభావం అమితమైనది. నాకు లెక్కలంటే ఉన్న భయం కారణంగా వారి కళ్ళల్లో పడకుండా తప్పించుకుంటూ కూచున్నా, అందమైన వారి ఇంగ్లీష్ చేతివ్రాత, మరింత అందమైన ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యం నాపై చెరగని ముద్ర వేశాయి. దురదృష్ట వశాత్తూ ఆ చేతి వ్రాత మాత్రం నేటికీ నాకు కలగానే మిగిలిపోయింది. అలాగే ఇతర మేథ్స్ లెక్చరర్లు మృదు స్వభావి ఆయిన శ్రీ సీ.వి. ఎన్. మూర్తి గారు, విద్యార్థుల శ్రేయస్సు గురించి ఆలోచించే శ్రీ బెన్నాస్వామి గారు బాగా జ్ఞాపకమే. కెమిస్ట్రీ బోధించిన శ్రీ రామాంజనేయులు గారు, శ్రీ శర్మ గారు, శ్రీ రాజుగారు గౌరవనీయులు. ఫిజిక్స్ లెక్చరర్లు శ్రీ మధుసూదన రావు గారు బాగా స్ట్రిక్ట్.. కానీ సబ్జెక్ట్ లో అపారమైన మేధస్సు. శ్రీ వెంకటేశ్వరరావు గారు అత్యంత క్లిష్టమైన అంశాలను కూడా సులభంగా బోధించగల ధీశాలి.. అత్యంత నిరాడంబర వ్యక్తిత్వం.. శ్రీ ముస్తఫా గారు ఆత్మీయంగా పలకరించడమే కాక కళాశాల అభివృద్ధికి కృషి చేసే వ్యక్తి.



అనంతరం కాకినాడ సెయింట్ మేరిస్ కళాశాలలో B.Ed. చేసిన కాలం కొద్దిపాటి డే అయినా చక్కటి ఉపాధ్యాయులు సైకాలజీ మేడం, శ్రీనివాసరావు గారు (మేథ్స్), శ్రీమతి కామేశ్వరి గారు (ఫిజిక్స్), శ్రీ స్టీఫెన్ గారు వంటి లెక్చరర్ల సహకారం మరువలేనిది. అంతేకాక నేడు ఎందరో ఆదర్శ ఉపాధ్యులుగా వెలుగొందుతున్న మిత్రులను ఆ కళాశాల అక్కడ పరిచయం చేసింది.

నిజానికి నా విద్యా ప్రయాణం B.Ed. తో ఆపేద్దామనుకున్నా.. కాని మిత్రుల ప్రోద్బలంతో, మా అమ్మగారి ప్రోత్సాహంతో, నాన్నగారి ఆశీస్సులతో ఎం.ఏ. ఇంగ్లిష్ జాయిన్ అయ్యా.. నిజానికి అదొక పెద్ద కథ... మరోసారి ప్రస్తావించాలి... కాకినాడ AU MSN పి.జి. సెంటర్ లో జాయిన్ అయిన నాకు ఇద్దరు అత్యంత ఆప్తులైన ఉపాధ్యాయులు/ గురువులు పరిచయం అయ్యారు. ఒకరు ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్యాలపై అఖండమైన జ్ఞానం బోధనలో అపారమైన అనుభవం కలిగి, నేడు కూడా పెద్ద వయసులోనూ యువకుల కన్నా ఉత్సాహంతో అనేక ఇంగ్లిష్ సేమినార్స్ లో రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించే ప్రొఫెసర్ విశ్వనాథరావు గారు... William Shakespeare’s play – Hamlet ;లోని Hamlet character ని ప్రతాప రుద్రీయం లోని యుగంధర మంత్రి పాత్రని కంపేర్ చేస్తూ... Feigned Madness ని వివరించిన ప్రతిభాశాలి. అలాగే T.S. Eliot యొక్క రచన The Waste Land ని అంత వివరణాత్మకంగా, ఒరిజినల్ రిఫరెన్స్ టెక్స్ట్ లతో, గ్రీక్, లాటిన్, సంస్కృత సూక్తులతో చెప్పగలిగే వారి ప్రతిభకు సాటి ఆధునిక కాలంలో ఎవరూ నాకు కనబడలేదు. నేటికీ కాకినాడ లో ఆంగ్ల, ఆంద్ర సాహిత్య సభలలో వారు ముఖ్యమైన వక్త. వినయంగా నాకెమీ తెలీదు అంటూనే గంటల తరబడి అద్భుతమైన ప్రసంగం చేయగలిగిన జ్ఞాని. ఆద్యంతం ఛలోక్తులు, అనంతమైన సాహిత్య రిఫరెన్స్ లతో సాగే వారి ప్రసంగం వినగలగడం పూర్వజన్మ సుకృతం.

ఇక మరొక స్ఫూర్తి దాయకమైన ప్రొఫెసర్... శ్రీమతి సోమలత గారు.. కాకినాడ పిజి సెంటర్ లో వారు ప్రవేశించి బోధించిన మొదటి బ్యాచ్ స్టూడెంట్స్ మేము. వారు రొమాంటిక్ పోయెట్రీ చెబుతోంటే, ఆ పువ్వులు, లతలు, చెట్లు, కోయిలలు, సీతాకోక చిలుకలు ప్రాణం పోసుకొని వచ్చి మన ముందు నాట్యమాడతాయంటే అతిశయోక్తి కాదు. బి.ఎడ్. లో ఉండగా మొదలైన నా పాటల రచన పిజి లో బాగా ఎక్కువైంది. మేడం గారు ఇంటికి పిలిచి పాడించుకున్న సందర్భాలు ఉన్నాయి. వారి సోదరుడిని గుర్తు చేసుకొనే వారు ఎందుకో నన్ను చూసి. చిన్న చిన్న ఆశలు, లక్ష్యాలతో ఆగిపోకూడదని, ఉన్నత లక్ష్యాలు ఉండాలని ప్రోత్సహించిన వారు. నేటికీ ఏ సెమినార్ లోనో సభలోనో కలిసినా ఆత్మీయంగా పలకరిస్తారు. వీరిరువురి ఆశీస్సులు, అలాగే ఇతర ప్రొఫెసర్లు – అమెరికన్ లిటరేచర్ ని చాలా అందంగా హుందాగా బోధించిన అప్పటి మా స్పెషల్ ఆఫీసర్ ప్రొఫెసర్ DJPN Reddy  గారు, ఆంగ్ల భాషా చరిత్రను, ఇండియన్ ఇంగ్లిష్ ను బోధించిన ప్రొఫెసర్ రాజేంద్ర కర్మార్కర్ గారు, సాధారణంగా కొరుకుడు పడని లిటరరీ క్రిటిసిజం పేపర్ ను నెమ్మదిగా, సరళంగా మా మెదళ్లలోకి ఇంకించే ప్రయత్నం చేసిన – ప్రొఫెసర్ లక్ష్మణరావు గారు... ఇలా అందరూవారి వారి రీతుల్లో బోధించిన ఆంగ్ల భాష, సాహిత్యాలు ఈరోజు ఆ రంగంలో లెక్చరర్ గా నేను ఉద్యోగం పొంది, చేయడానికి దోహదపడ్డాయి. వారందరికీ పాదాభివందనాలు.

పిజి రెండో సంవత్సరం లో ఉండగానే టీచర్ ఉద్యోగం రావడం, ఆరు నెలల తర్వాత సెక్రటేరియట్ ఉద్యోగానికి హైదరాబాద్ వెళ్ళడం, తర్వాతా ICET లో ర్యాంక్ తెచ్చుకొని JNTU లొ ఈవినింగ్ కాలేజిలో MBA (HR) చేయడం జరిగింది.... ఈవినింగ్ కాలేజ్ అయినా... చక్కటి క్లాసులు జరిగేవి. Dr, Aryasri గారు, Dr. Prasad గారు, Dr. Venkata Reddy గారు వంటి వారు  Management పై ఆసక్తిని పెంచారు.

ఇక తరువాతి చదువులపై ఆసక్తి ఉన్నా, సానుకూల వాతావరణం లేకపోవడం తో కొంత కాలం బ్రేక్ వచ్చింది. మరలా ఇంగ్లిష్ లెక్చరర్ గా జాయిన్ అయ్యాక, ఆసక్తి, అవసరం కలిసి వచ్చి, JNTU లో Ph.D. join అయ్యాయి. స్వయంకృత అలసత్వంతో బాగా ఆలస్యం అవుతోంది. కాని నా కన్నా వయసులో చిన్న అయినా, అనుభవంలో, హోదాలో పెద్దవారు అయిన ఆత్మీయులు Prof. T. Ashok గారు, Adikavi Nannaya University. గైడ్ గా తన సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. వారి చొరవతోనే రానున్న కొద్ది రోజుల్లో అయినా ఈ ప్రక్రియ ముగింపు దశకు చేరుతుంది అన్న ఆశ ఉన్నది. వారి సహృదయతకు, నిరంతర సహకారానికి హృదయ పూర్వక ధన్యవాదాలు.

ఇలా ఈ అర్ధ శతాబ్ద జీవితంలో అడుగడుగునా తమ మార్గదర్శకత్వంతో, మంచి మాటలతో, సుద్దులతో, సూచనలతో నా ప్రస్థానంలో వెన్నుతట్టి ప్రోత్సహించి, మనస్ఫూర్తిగా ఆశీర్వదించి, నేటికీ నా చిన్న చిన్న విజయాలకు పొంగిపోయే ప్రత్యక్ష, పరోక్ష, ఉపాధ్యాయులు, గురువులు, గురుతుల్యులు ఎందరో... ఎందరో మహానుభావులు.. అందరికి పాదాభివందనాలు..!!!

***

నూజిళ్ళ శ్రీనివాస్

ఆంగ్ల ఉపన్యాసకులు

ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల

రాజమహేంద్రవరం

05-9-2024

 

Comments

Popular posts from this blog

పిచ్చుకపై బ్రహ్మాస్త్రాలు వద్దండి....

కీర్తిచక్ర శ్రీ పందిళ్లపల్లి శ్రీనివాస్ 70 వ జయంతి