చెరగని కీర్తి, తరగని స్పూర్తి: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ - Dr. Sarvepalli Radhakrishnan - Noojilla Srinivas

 **చెరగని కీర్తి, తరగని స్పూర్తి: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్**

***


ప్రాచీన భారతదేశంలో, ఉపాధ్యాయులు లేదా గురువులు సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని కలిగి ఉన్నారు.
"గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు:, గురుదేవో మహేశ్వర: గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః" అనే ప్రాచీన గురుస్తుతి గురువుని సాక్షాత్తు ఆ త్రిమూర్తులతో సమానమైన దైవంగా భావించి పూజించడాన్ని తెలియజేస్తుంది.
ప్రాచీన భారదేశంలో గురువులు కేవలం విద్యావేత్తలుగా మాత్రమే కాకుండా వారి శిష్యుల, విద్యార్థుల జీవితాలను సమగ్రంగా తీర్చిదిద్ది, ఆదర్శవంతమైన జీవితాన్ని అందించిన మార్గదర్శకులుగా, తత్వవేత్తలుగా, మరియు ధార్మిక నేతలుగా గౌరవించబడ్డారు. భారతీయ సంస్కృతికి గురు-శిష్య సంప్రదాయం కేంద్రంగా నిలిచి
గురువు నుండి విద్యార్థికి జ్ఞానం, భక్తి, సంస్కృతి, సంప్రదాయాలు బదిలీ కావడానికి తోడ్పడింది.
రామాయణ కాలంలో వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, మహాభారత కాలంలో సాందీపని, ద్రోణాచార్యుడు, వేదవ్యాసుడు, ప్రాచీన చరిత్ర కాలంలో ఆదిశంకరులు, చాణక్యుడు, సమర్ధ రామదాసు మొదలైన వారు ఆదర్శవంతమైన గురువులుగా, ఉపాధ్యాయులుగా తమ గురుతర బాధ్యతలను నిర్వహించి ప్రపంచానికి ఆదర్శవంతమైన శిష్యులను అందించారు. అయితే, కాలక్రమేణా, వివిధ సామాజిక-రాజకీయ మార్పుల ప్రభావంతో, గురువుల, ఉపాధ్యాయుల స్థాయి తగ్గింది.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, తన జీవితం మరియు కార్యక్రమాల ద్వారా, ఆధునిక భారతదేశంలో ఉపాధ్యాయుల గౌరవం మరియు ప్రాముఖ్యతను పునఃస్థాపించడంలో కీలక పాత్ర పోషించారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. డాక్టర్ రాధాకృష్ణన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనలో ఒక తత్వవేత్త, విద్యావేత్త, రాజనీతిజ్ఞుడు మరియు దౌత్యవేత్త ఉన్నారు. అత్యంత సాధారణమైన కుటుంబ నేపథ్యం కలిగి, బాల్యం నుండి అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ఆయన తన కాలంలోని అత్యంత విశిష్టమైన పండితులలో ఒకరిగా ఎదిగిన విధానం ఎందరికో స్ఫూర్తిదాయకం. పట్టుదల, మేధస్సు మరియు విద్య పట్ల ఉన్న అకుంఠిత దీక్ష, నిబద్ధతల మూలంగా వారు పేదరికపు అడ్డంకులను అధిగమించి ప్రపంచ మేధావిగా గుర్తింపును సాధించగలిగారు.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న తమిళనాడులోని తిరుత్తణి సమీపంలోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు. సాధారణమైన బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చిన ఆయన చిన్న వయస్సు నుండే అసాధారణమైన మేధో జిజ్ఞాసను ప్రదర్శించారు. బాల్యం నుండి ఆయనలో ఉన్న అపరిమిత జ్ఞాన తృష్ణ, అవిశ్రాంత విద్యా సాధన వారు భావి జీవితంలో సాధించిన ఘన విజయాలకు పునాదిరాళ్ళు అయ్యాయి.
రాధాకృష్ణన్ యొక్క విద్యా ప్రయాణం స్థానిక పాఠశాలల్లో ప్రారంభమై, చివరికి మద్రాసు క్రిస్టియన్ కళాశాల నుండి తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందడం వరకు సాగింది. ఆయన విద్యార్థి జీవితం అంతటా జ్ఞాన సముపార్జన పట్ల వారికి గల శ్రద్ధ, పట్టుదలను స్పష్టంగా తెలియజేస్తుంది. ఆర్థికపరమైన పరిమితులను అధిగమించి తన చదువును కొనసాగించడానికి వారు అనేక స్కాలర్‌షిప్‌లను పొందారు.
డాక్టర్ రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తి మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ప్రారంభమైంది. ఆ తర్వాత రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాలలో రెండేళ్లపాటు ఫిలాసఫీ లెక్చరర్‌గా పనిచేశారు. రాజమండ్రిలో వారి పదవీకాలం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఈ కాలంలో వారు ఉపాధ్యాయునిగా మరియు తత్వవేత్తగా తన నైపుణ్యాలను మెరుగుపరచుకున్నారు. తన లోతైన అంతర్దృష్టితో, పరిశీలనతో చాలా మంది విద్యార్థులను ప్రభావితం చేశారు. తరువాత వారు మైసూర్ విశ్వవిద్యాలయం మరియు కలకత్తా విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రం బోధించారు. అనతికాలంలోనే రాధాకృష్ణన్ తత్వశాస్త్రంలో ప్రముఖ పండితునిగా గుర్తింపు పొందారు.
1949లో, డాక్టర్ రాధాకృష్ణన్ సోవియట్ యూనియన్‌లో భారత రాయబారిగా నియమితులయ్యారు. వారి పదవీకాలం లో భారతదేశం మరియు సోవియట్ యూనియన్‌ల మధ్య దౌత్య సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేసారు. ఇది ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభ సంవత్సరాల్లో భారత్ పాత్రకు సంబంధించి కీలకమైన అంశం. రాధాకృష్ణన్ మేధస్సు మరియు దౌత్య చతురత అంతర్జాతీయ వేదికపై భారతదేశ ప్రతిష్టను బాగా పెంచాయి.
డా. రాధాకృష్ణన్ గొప్ప రచయిత. వారి రచనలు తత్వశాస్త్ర రంగంలో చెరగని ముద్ర వేసాయి. "ది ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్," "ఇండియన్ ఫిలాసఫీ," "ది హిందూ వ్యూ ఆఫ్ లైఫ్," మరియు "యాన్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్." వంటి రచనలు వారి అత్యంత ప్రసిద్ధ రచనలలో కొన్ని. ప్రాచ్య మరియు పాశ్చాత్య తాత్విక సంప్రదాయాల గురించిన సంపూర్ణ అవగాహన, మరియు రెండింటి మధ్య సమన్వయం ద్వారా వారధిని నిర్మించగల సామర్థ్యం వారి సొంతం.
1952లో, డాక్టర్ రాధాకృష్ణన్ భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా ఎంపికయ్యారు. ఉపరాష్ట్రపతిగా వారి పదవీకాలం నిష్పాక్షికత తో కూడుకొని, పార్లమెంటరీ వ్యవస్థ యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి దోహదం చేసింది.
1962లో, డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ తర్వాత డాక్టర్ రాధాకృష్ణన్ భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. వారి రాష్ట్రపతి పదవీకాలంలో భారతదేశ సాంస్కృతిక మరియు విద్యా అభివృద్ధికి నిబద్ధత తో కృషి చేసారు. సహనం మరియు ఐక్యతల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, వారు తన ప్రసంగాలతో దేశాన్ని ఉత్తేజపరిచారు.
డాక్టర్ రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉండగా వారి పూర్వ విద్యార్థులు కొందరు వారి పుట్టినరోజును జరుపుకోవాలని కోరినప్పుడు, డాక్టర్ రాధాకృష్ణన్ దానిని ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకోవాలన్న వినయ పూర్వక ఆకాంక్షను వెలిబుచ్చారు. వారి సూచన ప్రకారం 1962 నుండి, వారి జన్మదినమైన సెప్టెంబర్ 5 వ తేదీని భారతదేశంలో ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతోంది.
తన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని రాధాకృష్ణన్ చేసిన సూచన దేశ భవిష్యత్తును రూపొందించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారనే వారి ప్రగాఢ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఉపాధ్యాయులను గౌరవించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేయడం ద్వారా, వారు గురువును గౌరవించే పురాతన భారతీయ సంప్రదాయాన్ని పునరుద్ధరించారు. తన తదనంతరం అనేక మంది విద్యావేత్తలను ప్రేరేపించారు. నేటికీ, డాక్టర్ రాధాకృష్ణన్ విజ్ఞానం, వినయం, సేవ, ఆదర్శాల కలయికగా భారతీయ ఉపాధ్యాయ సమాజానికి స్ఫూర్తిదాయకంగా కొనసాగుతున్నారు.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏప్రిల్ 17, 1975న కన్నుమూశారు. వారి మరణం ఒక ఘనమైన శకానికి ముగింపు పలికింది, కానీ పండితునిగా, తత్వవేత్తగా మరియు రాజనీతిజ్ఞునిగా వారి వారసత్వం, ప్రభావం,స్ఫూర్తి నేటికీ కొనసాగుతున్నాయి.
నేడు భారతదేశంలో ఉపాధ్యాయుల గౌరవాన్ని పునరుద్ధరించడానికి మరియు మెరుగుపరచడానికి, అనేక కీలకమైన రంగాలపై దృష్టి పెట్టడం చాలా అవసరం. మెరుగైన జీతభత్యాలు అందించడం, నిరంతర వృత్తిపరమైన అభివృద్ధికి భరోసా ఇవ్వడం మరియు ఉపాధ్యాయ వృత్తిని గౌరవించే సంస్కృతిని పెంపొందించడం అవసరం. అంతేకాక ప్రభుత్వ విధాన రూపకల్పనలో ఉపాధ్యాయుల ప్రమేయం ద్వారా ఉపాధ్యాయులకు సాధికారత కల్పించడం, వారు పనిచేసే ప్రదేశాలలో పరిస్థితులను, సౌకర్యాలను మెరుగుపరచడం వంటి చర్యలు సమాజంలో వారి స్థాయిని పెంచడంలో సహాయపడతాయి.
వికసిత్ భారత్ ఆకాంక్షను నిజం చేసుకోడానికి మరియు విశ్వ గురువుగా భారత్ స్థానాన్ని సుస్థిరం చేయడానికి ఉపాధ్యాయులు కీలకం. అకడమిక్ జ్ఞానాన్ని మాత్రమే కాకుండా విలువలు మరియు నైతికతను కూడా అందించడం ద్వారా, ఉపాధ్యాయులు విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా మరియు దూరదృష్టి గల నాయకులుగా తీర్చిదిద్దగలరు. సృజనాత్మక ఆవిష్కరణలు, విమర్శనాత్మక ఆలోచనలు మరియు ప్రపంచం పట్ల బాధ్యతను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర భారతదేశం యొక్క భవిష్యత్తు వృద్ధికి, ప్రపంచ వేదికపై నాయకత్వానికి చాలా ముఖ్యమైనది.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు, విద్య మరియు తత్వశాస్త్రానికి ఆయన చేసిన అపారమైన కృషిని మనం గుర్తుచేసుకుందాము. ఆయన బోధనలు భావితరాల విద్యావేత్తలకు, విద్యార్థులకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. మన దేశం మరియు ప్రపంచ అభివృద్ధిలో ఉపాధ్యాయులు పోషించే కీలక పాత్రను గుర్తించి, ఆయన ప్రతిపాదించిన విలువలకు కట్టుబడి రాధాకృష్ణన్ వారసత్వాన్ని గౌరవిద్దాం.
***
నూజిళ్ల శ్రీనివాస్
ఆంగ్ల ఉపన్యాసకులు
ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల
రాజమహేంద్రవరం
ఫోన్: 7981862200
***
-----------------------------------------
*విద్య మరియు ఉపాధ్యాయులపై రాధాకృష్ణన్ విలువైన ఆలోచనలు*
1. వ్యక్తి తనగురించి తాను తెలుసుకోవడంలో సహాయపడేవారే నిజమైన ఉపాధ్యాయులు.
2. మన మేథో సామర్థ్యాన్ని గుర్తించే సాధనమే విద్య
3. జ్ఞానం, విజ్ఞాన శాస్త్రాల ద్వారానే సంతోషం, ఆనందాలతో కూడిన జీవితం సాధ్యం
4. దేశంలోని అత్యుత్తమ మేధావులు ఉపాధ్యాయులుగా ఉండాలి
5. విద్య యొక్క అంతిమ లక్ష్యం - చారిత్రక పరిస్థితుల పైన, ప్రకృతి సృష్టించే అవరోధాల పైన యుద్ధం చేసే స్వేచ్ఛాయుత, సృజనాత్మక వ్యక్తుల సృష్టి.



Comments

Popular posts from this blog

పిచ్చుకపై బ్రహ్మాస్త్రాలు వద్దండి....

కీర్తిచక్ర శ్రీ పందిళ్లపల్లి శ్రీనివాస్ 70 వ జయంతి

ఎందరో మహానుభావులు - అందరికీ పాదాభివందనాలు - Tributes to my Teachers - Noojilla Srinivas