పిచ్చుకపై బ్రహ్మాస్త్రాలు వద్దండి....

 

పిచ్చుకపై బ్రహ్మాస్త్రాలు వద్దండి....

***



ఏండి... బాన్నారా?

బానే ఉండుంటారు లెండి...

మీరు... మీ ఇల్లు... మీ పిల్లలు... మీ ఆస్తులు..

అన్నీ నిండుగా, సల్లగా ఉంటే సాలు కదండీ...

సిన్ని నా బొజ్జకి శ్రీరామ రక్షా అని.. హాయిగా కాలు మీద కాలేసుకునో... నోట్లో ఏలేసుకునో గడిపెయ్యచ్చండి.... కుదిరితే ఒండుకుంటాం... లేదంటే స్విగ్గి లో పిజ్జానో... జోమాటో లో బర్గర్లో ఆర్డరిచ్చి ఆనక సుష్టుగా లాగించేయోచ్చు... మనకేటండి.. మానవ మారాజులం... మనం నేర్సుకున్న కోటి విద్యలు కూటి కొరకే... మనం నిత్యం పని చేసి చచ్చేది మన నోటి కొరకే...

అబ్బే.. .మిమ్మల్నేం అనటం లేదండి... పెపంచం లో ఎనబై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయని మన పెద్దలు సేప్పేరు కదండీ... ఆ లచ్చలాది జీవరాశులలో ఏ సీకూ సింతా, బాదరబంది, బాదా గీదా లేకుండా బతికేత్తన్నది మనవే కదండీ...

కానీ... మరి మనతో పాటు బూమి మీద నివసిస్తా మనకోసం ఎన్నో సేవలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సేత్తా, మన మనుగడకే మూలం అయిన అనేక జీవులు ఉన్నాయి కదండీ... మరి ఆటి పరిస్థితి నేడు ఎలా ఉంటాందో ఎవన్నా ఆలోచించారాండి?

ఉహూ... కుదరదు లెండి... మనవంత మన పెపంచంలో బిజీ బిజీ

నిజానికి మన పక్కోల్లనే పట్టించుకోనంత బిజీ... ఇక బక్కోల్లని ఎక్కడ పట్టించుకుంటావండి?

కానీ.. మడిసన్నాక కూసింత కళాపోషణ ఉండాలన్నట్టే...

మడిసన్నాక కూసింత మానవత్వం, ఇతర ప్రాణుల పట్ల కూసింత ప్రేమ, ఆప్యాయత ఉండాలండి...

ఈ కబుర్లన్నీ ఇప్పుడు ఎందుకు సెప్తున్నానంటే...

మా సిన్నప్పుడు మా ఇంటి ముంగిట్లో, పెంకుటింటి సూర్లో, మండువలోగిలి సావిట్లో మాతో పాటు సందడిగా తిరిగాడేసిన పిచ్చుకలు ఇప్పుడు ఎక్కడా కనబడ్డం లేదండి... ఎందుకో ఆ విషయం గుర్తొచ్చి చాలా బాదొచ్చి... ఓ నాలుగు మాటలు మీతో పంచుకొందాం అనిపించిందండి...

శానామట్టుకు సిన్నగా బొద్దుగా గోధుమ రంగులో ఉండి, చిన్న తోకతోటి, బలంగా ఉండే పొట్టి ముక్కు తోటి, గింజల్ని, సిన్న సిన్న పురుగుల్ని తింటా కిలకిలమంటా సందడి సేత్తా, తీరా దగ్గరికి ఎల్లగానే తుర్రుమంటా ఎగిరిపోయే ఆ పిచ్చుకల గుంపులు గుర్తుకొస్తే అందమైన మా కాలపు బాల్యం కూడా గుర్తుకొస్తాదండి... కానీ బాదేటంటే.. మా బాల్యంతో పాటే ఆ పిచ్చుకలు కూడా కనబడకుండా ఎగిరిపోడవండి...

పల్లెటూల్లల్లో పూరిల్లు, పెంకుటిల్ల సూరుల్లో గూళ్ళు కట్టుకొని, జనాలతో కలిసి మెలిసి బతికేసిన ఆ సిన్న పిచ్చుకమ్మలు ఇప్పుడు అదృశ్యం అయిపోతన్నాయన్న వార్తా ఇంటంటే గుండె తరుక్కపోతందండి... మెత్తని పీచు, గడ్డి తెచ్చి, ఆటితో గూడు కట్టడం, గుడ్లను పొదగడం, నోటితో ఆహారాన్ని తెచ్చి ఆటి పిల్లలకు అందించటం, ఆ పిల్లలు రెక్కలొచ్చి ఎగిరెంత దాకా ఆ పిచ్చుకల జంట జాగ్రతగా సూసుకోడం...ఇలా మా సిన్నప్పుడు కనబడ్డ అందమైన ద్రుశ్యాలన్నీ... హటాత్తుగా అదృశ్యం అయి పోయాయండి. పల్లెలే అంతం అయిపోతంటే.. ఇగ పల్లెల్లో పిచ్చుకలకి సోటేక్కడ ఉంటాదండి

మా సిన్నప్పుడు కొత్త దాన్యం ఇళ్ళకి తెస్తన్నప్పుదే పిచ్చుకల కోసం అందంగా ధాన్యం కంకులతో కుచ్చులు తయారు చేసి గుమ్మంలో కట్టేవోరండి... మరిప్పుడు తాటాకు పాకలు, బంగాల పెంకుల ఇల్లు నామోషీ కదండీ... అందుకే అయ్యి కంటికి కనబడకుండా సేసేసి అందరం అంతస్తుల బిల్డింగులు కట్టేస్తాన్నావండి...

ఆస్తులు, అంతస్తులనే కాకండా అనుబందాలని కూడా గజాల్లో కొలిసే మనం పిచ్చుకల కోసం సూరేక్కడ పెడతావండి? గూల్లెక్కడ కడతావండి?

 

పొలాలన్నీ రియలెస్టేట్ స్తలాలైపోయి, పల్లెల్ల్ని వొదిలేసి పట్టనాలెంటబడే జనాలు పెరిగేక ఈ పిచ్చుకల కోసం పట్టించుకొనే నాదుడు ఎవరండి? ఇక మనం పండించే పంటలు, కాయించే పళ్ళు, రసాయనాలతో నింపేసి ఆ కొద్ది పిచ్చుకల్ని ఇతర పక్షుల్ని సంపేత్తన్నావండి.. ఇగ పెరుగుతున్న ఎండల్లో తిండి, నీరు లేక అల్లల్లాడి పోయి సనిపోతున్న పక్షులు కూడా ఎక్కువేనంటండి...

కొన్నేళ్ళ వరకు మనతో పాటే పిచ్చుకలు కూడా పట్నాలకి వలసొచ్చి అపార్ట్మెంట్ గూల్ల్లలో అక్కడక్కడ కనబడేవండి.. కొంత కాలం వరకు.. ఈ మద్దెన అదీ కరువైపోయిందండి...

మనం ఎదగటం కోసం సేత్తన్న పనులన్నీ ఈ పిచ్చుకల్ని ఎగరకండా, అసలు బతక్కుండా సేత్తన్నాయంటే శానా బాదొచ్చేస్తందండి... రోబో 2 సినేమాలో సూపించినట్టు... మనం విచ్చలవిడిగా వాడేత్తన్న సెల్ ఫోన్ల కోసం నిలబెడతాన్న టవర్ల నుంచి ఎలువడే కిరణాల మూలంగా పిచ్చుక లు సచ్చిపోతన్నాయన్న మాట ఇంటంటే మా గొప్ప బాదోచ్చేత్తందండి ...

మన బతుకులు మా గొప్పగా బతికేత్తన్నాం అనుకుంటున్నాం గానండి... మన సుట్టూ తిరుగాడే అమాయక ప్రాణుల ఉసురు పోసుకొని బతికే మన బతుకూ ఒక బతుకేనాండి?

పచ్చదనం ఓ పిచ్చితనం అనుకొని ఎక్కడ సూసినా పచ్చని పెద్ద పెద్ద సెట్లు కొట్టేస్తాన్నావండి... ఇగ సెట్ల మీద గూళ్ళు పెట్టే పక్షులు ఎక్కడివండి? కిలకిలా నవ్వే పిచ్చుకలు ఎక్కడివండి? అంగుళం మేర కూడా బూమి అగపడకుండా  కాంక్రీట్ తో కప్పెట్టేస్తాన్నావంది... ఇలా ఆకారంలో సిన్నదైనా, సందడిలో పెద్దవైన పిచ్చుకలు కంటికి ఆపడ్డం తగ్గిపోయిందండి...

పక్షులు అంతరించి పోతే... అ తర్వాత మానవ ప్రపంచం కూడా అంతరించి పోదాండి?

ఆటిని మనం కాపాడ లేమండి?

మనసుంటే మార్గం ఉంటదని మన పెద్దలు సేప్పేరు కదండీ... మరి అలాంటప్పుడు మనసు కాస్త పెట్టి ఆలోసిస్తే... ఈ పిచ్చుకలు అంతరించిపోకుండా ఆపలేమాండి? ఇళ్ళ కాడ, స్కూళ్ళు, ఆపీసుల దగ్గర ఓ సెట్టుకో, కిటికీకో పిచ్చుకగూళ్లను ఏర్పాటు సేసి, పిచ్చుక జాతిని కొంతవరకు కాపాడచ్చేమో కదండీ... ఓ సిన్న మట్టి మూకుల్లో కాసిన్ని గింజలు, మరో మట్టి గిన్నెలో కూసిన్ని నీళ్ళు పోసి, అరా కోరా మిగిలిన పిచ్చుకల్ని ఇతర పక్షుల్ని రక్షించచ్చు గదండి...

కాని, ఏమాట కామాటే సెప్పు కోవాలండి... ఇప్పటికీ ఇంకా కొందరు రైతులు, పక్షుల ప్రేమికులు పిచ్చుకల ఆహారం కోసమని వరి కంకులను గుత్తులుగా కట్టి ఇంటి సూరుకు వేలాడ దీస్తాన్న వాళ్ళు ఉన్నారండి... అలాంటి ఒళ్లకి మనసారా దండం పెట్టాలండి....  ఆ మద్యన రాజమండ్రి లో జైన్ సొసైటీ వాళ్ళు ఇలాగే శానా సోట్ల పక్షులకోసం గింజలు, నీళ్ళు ఏర్పాటు సేసేరండి... అలాగే ఎబివిపి స్టూడెంట్ యూనియన్ వొళ్ళు కూడా కాలేజీల్లో ఇలాటి ఏర్పాట్లు సేసేరండి...

ఇలా ఎవరో ఒకరో ఇద్దరో కాకండా, పల్లెల్లో పట్టణాల్లో పిచ్చుకల్ని రక్షించడానికి అందరం నడుం బిగిన్చాలండి... లేదండి... సివరాకరికి ఈ బుల్లి పిట్టలు కతల్లోనో, పాటల్లోనో మాత్రమే మిగిలిపోయి, మన మడుసుల స్వార్దాన్ని, దుర్మార్గాన్ని మరీ మరీ గుర్తు సేత్తాయండి...

అందుకనే.. ఇప్పటికైనా ఈ పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు ఎయ్యడం మానేసి, ఆ జాతిని రక్షించే పనులు సేద్డామండి... మన పెద్దోల్లం అనుబవించిన ఆ సిన్న సిన్న ఆనందాల్ని మన తర్వాత వాళ్లకి కూడా అందిద్దావండి..

ఇళ్ళ దగ్గర  వరి కంకుల గుత్తుల్ని కట్టె రైతన్నలకి, పక్షి ప్రేమికులకి మనసారా జేజేలు సెబుతూ.. మనం కూడా ఆళ్ళ బాటలో నడుద్దావండి...

మళ్ళా ఆ కిలకిలారావాల్ని, అందమైన దృశ్యాల్ని పల్లెల్లో, పట్టణాల్లో అందరం కలిసి తీసుకొద్దావండి...

ఆయ్... నా మాట ఇంటారు కదండీ...

మీరు మంచోరు... ఇంటారు... మరుంటానండి....!!!

***

నూజిళ్ళ శ్రీనివాస్: Ph: 7981862200

"పక్షి బతకాలి" అంతరించిపోతున్న పిచ్చుకలు..ఆ రెండే అసలు కారణాలు.. @CircarExpressNews (youtube.com)

Comments

Popular posts from this blog

కీర్తిచక్ర శ్రీ పందిళ్లపల్లి శ్రీనివాస్ 70 వ జయంతి

ఎందరో మహానుభావులు - అందరికీ పాదాభివందనాలు - Tributes to my Teachers - Noojilla Srinivas